Tuesday, September 20, 2016

బాధ


నన్ను నేను ఓదార్చుకోవాలి
అప్పుడప్పుడూ నిన్ను కూడా...
ఆకులు రాలి పోతున్నందుకు
రెక్కల ఈకలు ఊడిపోతున్నందుకు
అలల అంచుల మీదుగా
వెలుతురు దీపం ఒరిగిపోతున్నందుకు.... బాధ
ఒలకబోసుకున్న తప్పులు
ఎదురు తిరిగినందుకు
పోగేసుకున్న నిజాలు
పొత్తు పెట్టుకోనందుకు
ఆదమరిచి పడుకుంటే
ఆకలి చప్పుళ్ళు నిద్ర లేపినందుకు
కరిగిపోయిన కల వెక్కిరించినందుకూ.....బాధ
చిన్నప్పడు పుస్తకంలో దాచుకున్న నెమలీకతో మాట్లాడిన మనసు ఎదురొచ్చినందుకు..... బాధ
వయసు వలువల్లోంచి
పసితనపు నవ్వుల పువ్వుల్లోకి
మరుపెరుగని మనసు లోతుల్లోకి
తెలియకుండానే జారి పడుతున్నందుకు.....బాధ
విరహాలు మౌనంగా విలపించినందుకు బాధ
ప్రణయాలు ప్రాణంలా కలవరించినందుకు బాధ
పారువెల్ల

Monday, September 19, 2016

ప్రణయం



వెన్నెల మాసిపోకుండా
మల్లెలు వాడిపోకుండా
వయసు ముడేసుకున్న మొహం ఆరిపోకుండా

అడుగులు వీడిపోకుండా
ఆశలు వీగిపోకుండా
నులివెచ్చని దాహంలా
చిలిపి కోరిక ఒకటి చల్లారి పోకుండా

అంతా వింతగా
మళ్ళీ కొత్తగా
ప్రణయం ఎందుకు పిలిచిందో
ముసి ముసి నవ్వులతో
తారలెందుకు మెరిసాయో బిడియంగా

 
మట్టిలో ఇంకిన వాన చుక్కలా
గాలితో కలిసి వీచిన  గంధంలా
పూవులో ఒదిగివున్న తేనె బొట్టులా
మధువులో దాగున్న తెలియని మైకంలా
ఒకరిలో ఇంకొకరం ఒంపుకున్నాక

చెరో సగం మనమయినా
ఒక్కటిగా పారుతున్న ప్రణయం కాదంటావా